యమప్రేమ | Sakshi
Sakshi News home page

యమప్రేమ

Published Fri, Jul 20 2018 12:05 AM

In fact,  that character is very fond of humans - Sakshi

ఏదో పాపం... ప్రాణాలు తీయాలన్న డ్యూటీ యముడికి వేయబట్టిగానీ... నిజానికి ఆ క్యారెక్టరుకు మనుషులంటే చాలా ఇష్టం. వారి వినోదం కోసం యముడనే ఆ క్యారెక్టరు చాలా చాలా త్యాగాలు చేయాల్సి వచ్చింది. ‘‘చతుర్ముఖ ప్రసాదిత సమస్త పర్యతలోక సామ్రాజ్యాధినాథుండయిన నేను’’  అంటూ ఆయన... ‘‘అవలోకన మాత్ర విచలిత విహ్వలీకృత సమస్త చతుర్దశ భువన చరాచర భూత భయంకర పాశాంకుశధారి’’ అనే తన ఫేమస్‌ డైలాగులతో యమాగా హూంకరించి నప్పటికీ... యముడు తన పాశాంకుశం ఉచ్చుముడిని వదులు చేసి ఎనీఆర్‌ ప్రాణాలను వదిలేయాల్సి వచ్చింది ‘యమగోల’లో! ఆ తర్వాత కూడా సందర్భంలో ప్రాణాల చిట్టా పుస్తకం కనపడక కమెడియన్‌ హీరో అలీ తల్లి ప్రాణాలను విడిచిపుచ్చి ‘యమలీల’ చూపాల్సి వచ్చింది పాపం!! అంతెందుకు... యముడికి మొగుడైన చిరంజీవి ప్రాణాలను డ్యూయల్‌రోల్‌కి పంపుతూ ఇంకోసారి, యమదొంగ జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రాణాలను స్పేర్‌ చేస్తూ  మరోసారి వారి వారి ప్రాణాలను మాటిమాటికీ వాపస్‌ ఇచ్చేయాల్సొచ్చింది!!! మరో సందర్భంలో కొత్త యముడికి మొగుడు  సినిమాలో తన తండ్రి చంద్రమోహన్‌ ప్రాణాలను అల్లరినరేశ్‌కు భద్రంగా అప్పజెప్పడంతో పాటు తన కూతురు యమజనూ అతడికి ఇచ్చి కన్యాదానమూ చేయాల్సి వచ్చింది. 

ఇలా పాపం... సదరు యముడి క్యారెక్టరు తెలుగుతెర మీద తన డ్యూటీ తాను చేయకుండా అనేక మార్లు మనుషుల ప్రాణాలు కాపాడుతూ ఉండిపోవాల్సి వచ్చింది. పదే పదే వెండితెర మీద తారల ప్రాణాలే కాపాడి కాపాడి బోరుకొట్టిందేమో. ‘ఇలా ఎంతసేపని మాటిమాటికీ సెలబ్రిటీలనే కాపాడతాం. కాస్త మనం అలా బెంగళూరు సిటీలో సామాన్యుల ప్రాణాలను రక్షిద్దాం’’ అనిపించిందా యముడి పాత్రకు. అందుకే యమరాజు భూమికను మళ్లీ ధరించి, రోడ్డు మీదికి వచ్చి మోటారుసైకిళ్లను నడిపేవారిని హెచ్చరిస్తోందా పాత్ర. ‘‘హెల్మెట్‌ లేకుండా బండి నడిపితే... త్వరలోనే నువ్వు నాకు హెల్‌ మేట్‌ అవుతావం’’టూ హెచ్చరిస్తోందా యమపాత్రధారి. రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా  ఈ హెచ్చరికలు చేస్త  ట్రాఫిక్‌ నిబంధలపై అవగాహన కల్పిస్తోందా పాత్ర. ఆ యముడి భూమిక దేశవ్యాప్తంగా పలువురిని ఆకర్షించింది (పై ఫొటో చూడండి). దీన్ని బట్టి మళ్లీ మరోసారి నిరూపితమవుతున్న అంశం ఏమిటంటే... ప్రాణాలు తీసే డ్యూటీ తనకు వేయబట్టిగానీ...  లేదంటే... అటు తెర మీద... ఇటు  రోడ్ల మీద మనుషుల ప్రాణాలను   రక్షించడం అంటే ఆయనకు యమా ఇష్టం. సారీ... ‘యమ’ ‘యమ’ ఇష్టం!!!
– యాసీన్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement